19వ వార్డు, షేర్ఖాన్ కొట్టాలు, తిక్క సామి దర్గా వెనుక, దేవీ నర్సింగ్ హోమ్ వెనుక, కృష్ణ దేవాలయం వెనుక, బండమిట్ట, ఎం ఎం కాలనీ, సున్నం బట్టి రోడ్డు, ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 19
ఆదోని పట్టణంలోని 19వ వార్డులో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం, విద్యుత్ ఈఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సిజిఆర్ఎఫ్) వద్ద చైర్ పర్సన్, ఆర్థిక సభ్యులు మధు కుమార్, సాంకేతిక సభ్యులు జయ కృష్ణారెడ్డి, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి, విద్యుత్ కార్యాలయం ఈఈ పురుషోత్తంకు వార్డు ప్రజల సమస్యలపై 19వ వార్డు కౌన్సిలర్ లక్ష్మన్న, నాయకులు తిప్పన్న, కృష్ణమూర్తి, కాలనీ వాసులు నాగేంద్ర, వీరేష్ తదితరులు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఆదోని పట్టణంలోని షేర్ ఖాన్ కొట్టాలు, తిక్క సామి దర్గా వెనుక, దేవీ నర్సింగ్ హోమ్ వెనుక, కృష్ణ దేవాలయం వెనుక, బండమిట్ట, ఎంఎం కాలనీ ప్రాంతాల ప్రజలు చాలా కాలంగా విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధానంగా షేర్ ఖాన్ కొట్టాల వద్ద జమ్మి చెట్టు కొట్టాలు, ఎస్సీ హాస్టల్ వెనుక ఉన్న కొట్టాలలో విద్యుత్ తీగలు కిందకి వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. చాలాచోట్ల కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. కృష్ణ దేవాలయం వెనుక, తిక్క స్వామి దర్గా వద్ద లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బండమిట్ట, ఎంఎం కాలనీ ప్రాంతాలలో విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు. అలాగే సున్నం బట్టి రోడ్డు వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వేరే చోటికి మార్చాలని కోరారు. విద్యుత్ స్తంభాలు లేని చోట కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సిజిఆర్ఎఫ్) ప్రత్యేక విద్యుత్ అదాలత్లో వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.







