నకరికల్లు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 28
అధికార అహంకారంతో ఒక ప్రభుత్వ ఉద్యోగిని దూషించిన ఘటన పల్నాడు జిల్లా చాగల్లులో చోటుచేసుకుంది.
అధికార అహంకారంతో ఒక ప్రభుత్వ ఉద్యోగిని దూషించిన ఘటన పల్నాడు జిల్లా చాగల్లులో చోటుచేసుకుంది. స్థానిక టీడీపీ నాయకుడు మద్దుల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్, నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న గిరిజన ఉద్యోగి డేవిడ్ నాయక్‌పై అసభ్య పదజాలం ఉపయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
చాగల్లు గ్రామంలో పనుల పర్యవేక్షణలో భాగంగా ఇన్చార్జిగా పనిచేస్తున్న డేవిడ్ నాయక్ తన విధులను నిర్వర్తిస్తున్నారు. విద్యుత్ సరఫరా విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్న డేవిడ్ నాయక్‌పై మద్దుల వెంకట్ తన రాజకీయ పెత్తనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
ఉద్యోగికి సహకరించాల్సింది పోయి, విచక్షణ కోల్పోయి కరెంట్ ఇవ్వవా నా కొడకా అంటూ నడిరోడ్డుపై అత్యంత హేయంగా దూషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంకట్ దురుసు ప్రవర్తన అక్కడితో ఆగలేదు. వివాదంతో సంబంధం లేని ఆ ఉద్యోగి తల్లిని, భార్యను సైతం అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ తన దిగజారుడుతనాన్ని బయటపెట్టుకున్నారు.
ఒక నాయకుడిగా ఉండి, కనీస సంస్కారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులపై ఇలా నోరు పారేసుకోవడం పట్ల సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గిరిజన ఉద్యోగిపై జరిగిన ఈ కుల వివక్ష దాడిని రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ తీవ్రంగా ఖండించారు.
కోట సుబ్బు మాదిగ ఆగ్రహం
రాజకీయ అండ ఉందనే అహంకారంతో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు మద్దుల వెంకట్‌కు ఎవరిచ్చారని కోట సుబ్బు మాదిగ ప్రశ్నించారు. కష్టపడి పనిచేసే ఉద్యోగిని, ఆయన కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యుడైన మద్దుల వెంకట్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగిపై బహిరంగంగా ఇంతటి దౌర్జన్యం, కుల వివక్ష పూరిత వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధిత ఉద్యోగి డేవిడ్ నాయక్‌కు రక్షణ కల్పించాలని, అధికార మదంతో విర్రవీగుతున్న మద్దుల వెంకట్‌పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ డిమాండ్ చేశారు.



