విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థిపై జరిగిన దాడి కేసులో చేబ్రోలు పోలీసులు కీలక పురోగతి సాధించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందా ఆదేశాల మేరకు, ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారిపై భారతీయ న్యాయ స్మృతి (BNS) ప్రకారం కేసు నమోదు చేశారు.
బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాకముందే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి Cr. No. 28/2026 కింద కేసు నమోదైంది.
నిందితులు దాడికి పాల్పడటమే కాకుండా, దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, వారిపై భారతీయ న్యాయ స్మృతిలోని సెక్షన్ 109(1) R/w 3(5) BNS కింద కేసు నమోదు చేశారు.
అరెస్ట్ అయిన నిందితులలో దారా పరిమళ్ రిహాన్ @ లక్కీ, వెలిశెట్టి ఆదర్శ్ బాబు, వాకా సోమ శేఖర్ @ సోము, రాపోలు తిరుపతిరావు, నందం బాల కోటేశ్వరావు, త్రోవగుంట బాల సాయిరామ్, కొత్తా సాయి అమర్ నాధ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని రిమాండ్కు తరలించారు.


