తోట్టంబేడు, 2026-11-14
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేదన్న కారణంతో వడ్డీ వ్యాపారులు ఇంట్లోకి చొరబడి ఆరు నెలల పసికందును ఎత్తుకెళ్లినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అప్పు వసూలు కోసం పసికందును తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, తొట్టంబేడు మండలం శివనాథపాలెంకు చెందిన ఆది, మేఘమాల దంపతులు సుమారు ఏడు నెలల క్రితం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నివాసం ఉంటున్న వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబ సభ్యుల వద్ద రూ.1,50,000లను ఐదు రూపాయల వడ్డీకి అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అయితే తీసుకున్న అప్పుకు సంబంధించి అసలు, వడ్డీ సకాలంలో చెల్లించలేదన్న కారణంతో అప్పు ఇచ్చిన వారు శివనాథపాలెంలోని ఆది, మేఘమాల నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
పసికందు అపహరణపై ఆరోపణలు
ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఆరు నెలల పసికందును తమ వెంట తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పు వసూలు కోసం పసికందును తీసుకెళ్లారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
అప్పు లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తితే చట్టపరమైన మార్గాలను ఆశ్రయించాల్సి ఉండగా, పసికందును తీసుకెళ్లారన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, పసికందు ఆచూకీతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






