ప్రకాశం, 2026-11-16
బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, సంక్షేమం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రకాశం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ. పద్మ సునంద పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డిబిఆర్సీ) ప్రకాశం జిల్లా శాఖ రూపొందించిన బాలల హక్కులు, బాలల రక్షణ, సంక్షేమ అంశాలపై అవగాహన పోస్టర్లను సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి బాలబాలికకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, పౌష్టికాహారం, రక్షణతో పాటు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాలలపై జరుగుతున్న హింస, వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ మరియు పర్యవేక్షణ అధికారి బి. రత్న ప్రసాద్ మాట్లాడుతూ బాలల హక్కులకు భంగం కలిగించే ఘటనలు ఎక్కడైనా చోటుచేసుకుంటే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాధిత బాలలకు తగిన రక్షణ, న్యాయం కల్పించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బాలల సమస్యల పరిష్కారం, రక్షణ, కౌన్సెలింగ్ సేవల కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను వినియోగించుకోవాలని తెలిపారు.
డిబిఆర్సీ జిల్లా కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల్లో బాలల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బాలల భద్రతకు సంబంధించిన అంశాలపై గ్రామస్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, బాలల సంరక్షణ అధికారి శ్రీలక్ష్మి, శాఖ సిబ్బంది, డిబిఆర్సీ దర్శి ఏరియా కో-ఆర్డినేటర్ గుంటూరు నాగమణి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బిళ్ల శరత్, కొండేపి సిడిపిఓ సుశీల, సూపర్వైజర్ షేక్ రిజ్వానా తదితరులు పాల్గొన్నారు.






