బాపట్ల, 2026-11-27
బాపట్ల జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాపట్ల జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుందని, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 29వ తేదీన రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, శుక్రవారం ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.
బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో రెండో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం ఏడు మండలాల పరిధిలో 113 పంచాయతీలు, 1,204 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 17 సర్పంచ్ స్థానాలు, 393 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయని వెల్లడించారు. మిగిలిన 96 పంచాయతీలు, 811 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 96 సర్పంచ్ స్థానాలకు 281 మంది, 811 వార్డు సభ్యుల స్థానాలకు 1,964 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వివరించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం, శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి అభ్యర్థులు, వారి అనుచరులు, కార్యకర్తలు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువుల పంపిణీ వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికలు జరిగే ప్రాంతాలతో సంబంధం లేని ఇతర ప్రాంతాల వ్యక్తులు ఆయా గ్రామాల్లో ఉంటే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ప్రత్యేక నిఘా
అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆయా ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమ నిబంధనలను పాటిస్తూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8333813228, అత్యవసర సహాయ నంబర్ 112 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ తెలిపారు.







