క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-21
బాపట్ల పురపాలక సంఘ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన ప్యానల్‌ను ప్రకటించారు. చైర్మన్ అభ్యర్థిగా పేర్లి సునీల్ కుమార్‌ను బరిలో నిలిపిన ఆయన, తమ ప్యానల్ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను పత్రికా సమావేశంలో పరిచయం చేశారు.
బాపట్ల పురపాలక సంఘ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన ప్యానల్‌ను ప్రకటించారు. చైర్మన్ అభ్యర్థిగా పేర్లి సునీల్ కుమార్‌ను బరిలో నిలిపిన ఆయన, తమ ప్యానల్ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను పత్రికా సమావేశంలో పరిచయం చేశారు. మొత్తం 44 వార్డులకు గాను 16 వార్డుల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.
చైర్మన్ అభ్యర్థి పేర్లి సునీల్ కుమార్ బాపట్లకు చెందిన విద్యావంతుడని, ఉపాధ్యాయ కుటుంబ నేపథ్యం కలిగి ఉన్నారని అన్నం సతీష్ తెలిపారు. గత 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్న ఆయన 2004లో తొలిసారిగా కౌన్సిలర్‌గా విజయం సాధించారని గుర్తుచేశారు. పట్టణ సమస్యలపై అవగాహన, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నందున ఆయనను చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు వివరించారు.
తమ ప్యానల్ తరఫున 15 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గ్యాస్ సిలిండర్ గుర్తు, 29వ వార్డు అభ్యర్థి కొట్రా రేవతికి ఉంగరం గుర్తు కేటాయించగా, చైర్మన్ అభ్యర్థి పేర్లి సునీల్ కుమార్‌కు కప్పు సాసర్ గుర్తు కేటాయించినట్లు తెలిపారు. తమ ప్యానల్ పోటీ చేయని మిగిలిన వార్డుల్లో ప్రజలు అభ్యర్థుల వ్యక్తిగత పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం, స్థానిక సమస్యల పరిష్కారంపై చూపే చొరవను పరిగణనలోకి తీసుకొని ఓటు వేయాలని కోరారు. కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, దోమల బెడద వంటి సమస్యలను పరిష్కరించే నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
తమ అభ్యర్థులు లేని వార్డుల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చని, చైర్మన్ ఎన్నికలో మాత్రం కప్పు సాసర్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అభ్యర్థి గెలుపు బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన బాపట్ల నిర్మాణమే తమ లక్ష్యమని అన్నం సతీష్ ప్రభాకర్ స్పష్టం చేశారు.







