జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోలో నాలుగో భారత్జపాన్ 22 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. జపాన్ తరపున విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటేగి, రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి పాల్గొన్నారు.
ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, సముద్ర భద్రత, సైనిక విన్యాసాలు, రక్షణ సాంకేతికత, పారిశ్రామిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. జపాన్ సైనిక దళాలు తొలిసారిగా భారత్లోని ఫైరింగ్ రేంజ్లను ఉపయోగించి ప్రత్యక్ష ఆయుధ శిక్షణ పొందేందుకు వీలు కల్పించే ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. రక్షణ రంగంతో పాటు, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, ఆధునిక తయారీ రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. భవిష్యత్తులో ఈ రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి మార్గాలను అన్వేషించనున్నారు. 2027లో భారత్జపాన్ దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.






