చీరాల, 2026-11-20
చీరాల మండలం గవినివారిపాలెం గ్రామ సర్పంచ్ పదవికి మాజీ సర్పంచ్ నక్కల రమేష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చీరాల మండల పరిధిలోని గవినివారిపాలెం గ్రామ సర్పంచ్ పదవికి మాజీ సర్పంచ్ నక్కల రమేష్ స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ మరోసారి ఆయనకు అవకాశం కల్పిస్తామని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నక్కల రమేష్ మాట్లాడుతూ గతంలో సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామ ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా సొంత ఖర్చులతో ఎనిమిదిన్నర సంవత్సరాల పాటు మినరల్ వాటర్ సరఫరా చేశానని పేర్కొన్నారు. ఎకరానికి రూ.1,000 చెల్లించలేని రైతులకు ఐదేళ్లపాటు ఉచితంగా సాగునీరు అందించానని గుర్తుచేశారు.
కరోనా మహమ్మారి సమయంలో సుమారు రూ.25 లక్షల సొంత నిధులతో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలిచానని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నిమ్స్, కేర్, ఉస్మానియా, బసవతారకం, గాంధీ తదితర ఆసుపత్రులకు స్వయంగా తీసుకెళ్లి ఉచిత వైద్య సేవలు అందేలా కృషి చేశానని తెలిపారు. మధిర ఆసుపత్రి ద్వారా 700 మందికి పైగా కంటి శుక్లాల ఆపరేషన్లను సొంత ఖర్చులతో చేయించానని వెల్లడించారు.
తాను పదవిలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా కాకుండా ప్రజల సేవకుడిగా పనిచేశానని పేర్కొన్న రమేష్, మరోసారి అవకాశం కల్పిస్తే తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు గవినివారిపాలెం గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.







