సమాజంలో వెనుకబడిన, నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా 'హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా' సంస్థ నిరంతరం శ్రమిస్తోందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా, రఘుదేవపురం మండలంలో అర్హులైన పలు నిరుపేద కుటుంబాలకు జూలై నెలకు సంబంధించిన పెన్షన్ (ఆర్థిక సాయం) పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ చైర్మన్ మరియు ఫౌండర్ శ్రీ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమర్ బాబు మరియు నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ ముత్యాల బాబు సూచనలతో, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు డా. కారి దాసు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగంపేట జెడ్పీటీసీ శ్రీ పేపకాయల రాంబాబు లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలతో పాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పేదలను ఆదుకోవడం అభినందనీయమని కొనియాడారు. మానవ హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కౌన్సిల్ నిర్వాహకులను ఆయన అభినందించారు.
రాష్ట్ర అధ్యక్షులు డా. కారి దాసు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంస్థ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ చైతన్య, సంస్థ ప్రతినిధులు కారి ప్రదీప్ కుమార్, అలపు సత్తిబాబు, నూకరాజు మరియు స్థానిక నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.












