వేటపాలెం, 2026-11-22
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గునుకుల రామ్మూర్తి బరిలో నిలిచారు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గునుకుల రామ్మూర్తి బరిలో నిలిచారు. మహాలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన గుర్తింపు పొందిన ఆయన, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ఉన్నత విద్యావంతుడైన (బి.టెక్.ఎల్.ఎల్.బి) రామ్మూర్తికి గ్రామంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. కొత్తపేట గ్రామంలో ప్రధానంగా మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం, విద్యుత్ లైన్ల సమస్యలు, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధుల్లో కుక్కల బెడద వంటి సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని తెలిపారు.
గ్రామంలోనే కూరగాయల మార్కెట్ ఏర్పాటు లక్ష్యం
కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలోని పరిసర గ్రామాల్లో కూరగాయల సాగు విస్తృతంగా జరుగుతోందని, అనేకమంది రైతులు, వ్యవసాయ కూలీలు నిత్యం కూరగాయలను సాగు చేసి విక్రయిస్తున్నారని రామ్మూర్తి తెలిపారు. అయితే, పండించిన కూరగాయలను విక్రయించేందుకు చీరాల పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకోవడం, తిరిగి గ్రామాలకు చేరుకోవడం రైతులకు, రోజువారీ వ్యవసాయ కూలీలకు భారంగా మారుతోందని ఆయన తెలిపారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాను సర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం చీరాల నియోజకవర్గ శాసనసభ్యులతో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులను సంప్రదించి కొత్తపేట గ్రామంలోనే కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనివల్ల స్థానిక రైతులకు రవాణా భారం తగ్గడంతో పాటు, తమ పంటలను గ్రామంలోనే విక్రయించుకునే అవకాశం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సర్పంచ్‌గా ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే గెలుపొందిన మరుక్షణం నుంచే గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు తావులేకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. కొత్తపేట గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామపంచాయతీగా, ప్రథమ స్థానంలో నిలపడమే తన ప్రధాన లక్ష్యమని గునుకుల రామ్మూర్తి వెల్లడించారు. ప్రజల సహకారం, ఆశీర్వాదంతో గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.







