ప్రధాని నరేంద్ర మోదీ పారిశ్రామికవేత్తలపై చేసిన వ్యాఖ్యలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. పరిశ్రమలకు ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా వాటి ఆకలి తీరడం లేదని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, దేశంలో ఎవరి ఆకలి గురించి మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు.
పరిశ్రమలకు రాయితీలు కల్పించినప్పటికీ ఉద్యోగాల కల్పన, ఉద్యోగుల జీతాల పెంపులో ఆశించిన ఫలితాలు రావడం లేదని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ఈ విధంగా స్పందించారు. దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు, గనులు, అడవులు, విద్యుత్, బొగ్గు, రహదారులు వంటి కీలక రంగాలు కొద్దిమంది వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళ్లాయని రాహుల్ ఆరోపించారు.
ఇన్ని రంగాల్లో అవకాశాలు పొందిన సంస్థలు ఎన్ని ఉద్యోగాలను సృష్టించాయని ప్రశ్నించారు. పెద్ద సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చిన్న వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. పెద్ద సంస్థల గుత్తాధిపత్యం వల్ల ఉద్యోగాలు పెరగకపోగా, ధరలు పెరిగి పోటీ తగ్గుతుందని వ్యాఖ్యానించారు.
నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ విధానాల వల్ల చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయని రాహుల్ విమర్శించారు. ప్రభుత్వ విధానాల కారణంగా న్యాయంగా పోటీ పడే సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం, దాని సన్నిహిత వ్యాపార వర్గాలే దేశ ఆర్థిక వ్యవస్థను దోచుకున్నాయని విమర్శించారు.
ఖర్గే స్పందన
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యాలను వ్యాపారవేత్తలపైకి నెట్టడం సరికాదని అన్నారు. దేశంలో ఆరోగ్యకరమైన పోటీ లేకపోవడం వల్ల నూతన ఆవిష్కరణలు, తయారీ రంగం దెబ్బతింటున్నాయని ఆరోపించారు. కొద్దిమంది పెట్టుబడిదారులకే ఆర్థిక వ్యవస్థలో అధిక ప్రాధాన్యత లభిస్తోందని విమర్శించారు.
అసలు మోదీ ఏమన్నారు
ఢిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. 2014లో 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించడం, జీఎస్టీ రేట్లను సరళీకరించడం, పన్ను రిటర్నులు, రీఫండ్ ప్రక్రియలను సులభతరం చేయడం వంటి చర్యలను ప్రస్తావించారు. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించినప్పటికీ, సంస్థలు ఉద్యోగుల జీతాలు పెంచుతున్నాయా కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నాయా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం నుంచి రాయితీలు ఆశించే పరిశ్రమలు ఉద్యోగుల సంక్షేమం, దేశ ఆర్థికాభివృద్ధికి కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.






