ఏలూరు, జూలై 21
ఏలూరు జిల్లాలో ఆగష్టు నెలలో 26 గ్రామాల్లో 14,153 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. జయలక్ష్మితో జరిగిన జూమ్ సమీక్షలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు. 22ఏ భూ సమస్యలకు సంబంధించి 410 దరఖాస్తులు రాగా, 107 ఆమోదించబడ్డాయి.
జిల్లాలో ఆగష్టు నెలలో 26 గ్రామాలలో 14,153 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. జయలక్ష్మికి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుండి 22ఏ దరఖాస్తుల పరిష్కారం, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రీ సర్వే, ఐవిఆర్ఎస్ సర్వే, రెవిన్యూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. జయలక్ష్మి మంగళవారం రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఆగష్టు నెలలో 26 గ్రామాలలో 14,153 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు సంబంధించి ఈ-కెవైసి పూర్తి చేస్తున్నామన్నారు. 22ఏ భూ సమస్యలకు సంబంధించి 410 దరఖాస్తులు అందాయని, వాటిలో 107 ఆమోదించామని, నిబంధనల మేరకు లేని 109 దరఖాస్తులను అందుకు గల కారణాలు తెలియజేస్తూ తిరస్కరించామన్నారు. మిగిలినవి నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
రెవిన్యూ సేవలకు సంబంధించి ఐవిఆర్ఎస్ సర్వేలో జిల్లాలో 67.8 శాతం ప్రజల సంతృప్తి స్థాయిని సాధించామని, అదేవిధంగా ఎఫ్. లైన్ సర్వేలో 74 శాతం సాధించామని, ఇది మరింత మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. జయలక్ష్మి మాట్లాడుతూ 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆగష్టు నెలలో పంపిణీ చేయవలసిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ ఎం. శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, రమణ ప్రభృతులు పాల్గొన్నారు.











