ఏలూరు, జూలై 21
ఏలూరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్పష్టం చేశారు. రూ.19 లక్షల నిధులతో మాదేపల్లి రోడ్డులో నిర్మిస్తున్న సిమెంట్ రహదారి పనులను ఆయన పరిశీలించారు. డిసెంబర్ నాటికి 90% రోడ్ల పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని 13వ డివిజన్ మాదేపల్లి రోడ్డులోని గాయత్రీనగర్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.19 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రహదారి నిర్మాణ పనులను ఆర్టీసి విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడుతూ... నియోజకవర్గంలో అభివృద్ధి ప్రణాళికలను దశలవారీగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. వస్తున్న నిధులన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ, డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రాధాన్యతా క్రమంలో 90 శాతం రహదారి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీనిచ్చారు.
నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈడా (EADA) నిధులు రూ. 21 కోట్లు, ఎన్‌క్యాప్ (NCAP) నిధులు రూ. 11 కోట్లు, 15వ ఆర్థిక సంఘం 9వ విడత నిధులు రూ. 4 కోట్లు... మొత్తంగా రూ.36 కోట్లకు పైగా నిధులతో చేపడుతున్న ఈ పనులన్నీ ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లను గట్టిగా హెచ్చరించినట్లు తెలిపారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల గోదావరి జలాల లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో, నగర ప్రజలందరూ తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, ఎమ్మెల్యే బడేటి చంటి సమర్థవంతమైన నాయకత్వంలో ఏలూరు నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, క్లస్టర్ ఇంచార్జ్ పైడి వెంకట్రావు, కో క్లస్టర్ ఇంచార్జ్ మెరుగుమాల శ్రీను, డివిజన్ ఇంచార్జ్ మెరుగుమాల ఏసు మని, డివిజన్ ప్రెసిడెంట్ ఊడి రాజశేఖర్, బీజేపీ నాయకులు సురేష్ పాల్గొన్నారు. వీరితో పాటు కూటమి పార్టీలకు చెందిన స్థానిక నాయకులు పూజారి నిరంజన్, చిన్ని అర్జున్, మాకాల రమేష్, బుధ్ధా నాగేశ్వరరావు, దోసపర్తి రాజు నాయుడు, కోలా శివ, చిత్తిరి శివ, బోండా రాము నాయుడు, బెజవాడ నాగభూషణం కుమార్, వాసా సాయి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.












