Visakhapatnam/Anandapuram (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 22
కైకలూరు నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇండక్షన్ స్టవ్‌లు, ఆధునిక వంట పాత్రలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కైకలూరు మండలం మార్కెట్ యార్డులో ఘనంగా జరిగింది.
కైకలూరు మండలం మార్కెట్ యార్డులో బుధవారం అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణలో భాగంగా ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇండక్షన్ స్టవ్‌లు మరియు ఆధునిక వంట పాత్రలను అందజేశారు.
దేశ భవిష్యత్తు అయిన చిన్నారుల ఆరోగ్యం, అలాగే గర్భిణీలు, బాలింతల సంక్షేమం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కొనియాడారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు, సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.
వంటల తయారీకి ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్లపై ఆధారపడటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. 'ఇంధన పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణ' ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఇండక్షన్ స్టవ్‌ల ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటు, అంగన్వాడీ సిబ్బందికి వంట చేయడం మరింత సులువు అవుతుందని, చిన్నారులకు వేగంగా నాణ్యమైన పౌష్టికాహారం అందించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి వీరమల్లు నరసింహారావు, అలాగే పలువురు ఎన్డీఏ (NDA) నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.











