గుంటూరు, 2026-06-05
గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలనేది ఏడు దశాబ్దాల కల అని, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. కొందరు రైతులను రెచ్చగొడుతూ అపోహలు సృష్టిస్తున్నారని, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలనేది ఏడు దశాబ్దాల కల అని, దీనికి సంబంధించిన చరిత్ర అందరికీ తెలిసిందేనని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. 2022లో భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినా, గత వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఆ నోటిఫికేషన్ గడువు ముగిసిందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రక్రియ ఊపందుకుందని, 2025 అక్టోబర్లో మెయిన్ కాలువ తుది అలైన్మెంట్కు ఆమోదం లభించిందని వివరించారు. ఆమోదించబడిన అలైన్మెంట్కు సంబంధించి గుంటూరు జిల్లాలోని 7 గ్రామాల్లో జనవరిలో, మిగిలిన 4 గ్రామాలకు జూలైలో భూసేకరణ నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు.
గుంటూరు జిల్లాలో 11 గ్రామాల్లో 440 ఎకరాలకు భూసేకరణలో భాగంగా ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామని, డ్రాఫ్ట్ నోటిఫికేషన్, పబ్లికేషన్ తర్వాత అవార్డు పాస్ చేసి, పేమెంట్ రిలీజ్ చేశామని ఎమ్మెల్యే ఏలూరి వివరించారు. ఇప్పటివరకు 5 గ్రామాల్లో 8 కిలోమీటర్ల మేర రైతులకు నిధులు విడుదలయ్యాయని, ఇందులో 3 గ్రామాల్లో 5 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులు జరుగుతున్నాయని తెలిపారు. మిగతా గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, బాపట్ల జిల్లాలో కూడా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అలైన్మెంట్ మార్పు, బదిలీలతో ఆలస్యం
పర్చూరు నియోజకవర్గంలో భూసేకరణ ప్రక్రియ కాస్త ఆలస్యం కావడానికి కొన్ని కారణాలున్నాయని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. గుంటూరు జిల్లాలోని వరగాని, అన్నపర్రు, పాలపర్రు, రాజుపాలెం పరిధిలో కాలువ అలైన్మెంట్ను 2023లో వైసీపీ ప్రభుత్వం మార్చిందని, మారిన అలైన్మెంట్ ప్రతిపాదనలు 2025లో ఆమోదం పొందడంతో, దానికి అనుగుణంగా భూసేకరణ ప్రక్రియ 2026లో ప్రారంభమైందని వివరించారు. ఈ నాలుగు గ్రామాల్లో అలైన్మెంట్ మార్పు కారణంగా, పర్చూరు నియోజకవర్గంలోని ఇనగల్లు గ్రామ పరిధిలో కూడా కొంత మేర అలైన్మెంట్ మార్పు జరిగిందని తెలిపారు. అదేవిధంగా, కలెక్టర్, , రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు బదిలీ కావడంతో నోటిఫికేషన్ ప్రక్రియ కొంత ఆలస్యమైందని పేర్కొన్నారు.
అయినప్పటికీ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో కూటమి ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతరం వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. కొరకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి, భూసేకరణ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. రానున్న రెండు నుంచి మూడు వారాల్లో ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించనుంది.
రైతులకు అపోహలు వీడాలని సూచన
గుంటూరు ఛానల్ పెదనందిపాడు వరకు వచ్చి ఆగిపోతుందని కొందరు కల్పిత మాటలు సృష్టించి రైతులను రెచ్చగొడుతున్నారని, వారిని ఆందోళనకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి ఆవేదన వ్యక్తం చేశారు. పెదనందిపాడు వరకు వచ్చి ఆగిపోతుందనే మాట కేవలం అపోహ మాత్రమేనని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇది పర్చూరు మండలంలోని 28 వేల ఎకరాలకు నీళ్లు అందించే మహా యజ్ఞమని, ఈ ప్రక్రియ నిరాటంకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందనవసరం లేదని, ఈ ప్రక్రియను ఎంతో బాధ్యతగా తీసుకుని, త్వరితగతిన పూర్తిచేసేందుకు పూర్తి బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు తెలిపారు.












