బాపట్ల జిల్లా, కారంచేడు మండల రెవెన్యూ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. సామాన్యులకు సేవలు అందించాల్సిన కార్యాలయం, ముడుపులు తీసుకుని బ్రతికున్న వ్యక్తిని కూడా రికార్డుల్లో మరణించినట్లుగా నమోదు చేసి, ఆస్తుల మార్పిడికి పాల్పడుతోందని సమాచారం.
చెన్నుపాటి రంగనాయకులు అనే వృద్ధుడికి చెందిన 15 సెంట్ల భూమిని కాజేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సహకరించిందని ఆరోపణలున్నాయి. బాధితుడు రంగనాయకులు నిక్షేపంగా బ్రతికే ఉన్నారని, ప్రభుత్వ వృద్ధాప్య పెన్షన్, రేషన్, ఓటు హక్కు వంటివి పొందుతున్నారని తెలిసింది.
అయినప్పటికీ, ఎమ్మార్వో కార్యాలయ రికార్డుల్లో మాత్రం ఆయన చనిపోయినట్లుగా చూపించి, ఆ భూమిని ఆయన కోడలి పేరు మీద రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ మ్యుటేషన్ చేసినట్లు సమాచారం. తన ఆస్తి అన్యాక్రాంతమైందని తెలుసుకున్న వృద్ధుడు కార్యాలయానికి వెళ్లి నిలదీయగా, అక్కడి అధికారులు "మీరు బ్రతికే ఉన్నారా?" అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని బాధితులు పేర్కొన్నారు.
ఆరు నెలల క్రితం కార్యాలయం చుట్టూ తిరిగినా "సరి చేస్తాం" అని చెప్పిన అధికారులు, ఇప్పటివరకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడం వెనుక భారీగా ముడుపులు అందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించినప్పుడు, "ఆర్డీఓ దగ్గరికి పంపించాం, అక్కడ చూసుకోండి" అంటూ చేతులు దులుపుకుంటున్నారని సమాచారం. తప్పు జరిగినట్లు ఆధారాలున్నా, రికార్డులను సరిచేయకుండా కాలయాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కారంచేడు రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఈ అవినీతి భాగోతంలో వాటాలు పంచుకున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. "డబ్బులు ఇస్తే బ్రతికున్న వాళ్ళని చంపేసి, ఆస్తులు మార్చేస్తారా? ఇదేనా మీ పరిపాలన?" అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఈ "రిజిస్ట్రేషన్ దందాలను" అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, బాధితుడికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.







