కడప రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో గంజాయి మూకల చేతిలో దారుణ హత్యకు గురైన అలంకానపల్లెకు చెందిన పెద్ద దస్తగిరి ఘటనపై సీపీఐ తీవ్రంగా స్పందించింది. ఈ హత్యపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)తో విచారణ జరిపించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో, గంజాయి అరికట్టడంలో విఫలమైన ఎస్పీ నచికేతన్ను తక్షణమే బదిలీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు.
గత రెండు రోజుల క్రితం మారమ్మ జాతరలో జరిగిన వివాదం ఆదివారం రాత్రి 11 గంటలకు గంజాయి మూకలు కత్తులతో దస్తగిరి ఇంటిపై దాడి చేసే స్థాయికి చేరిందని గాలి చంద్ర తెలిపారు. ఈ దాడిలో ఇరుగుపొరుగు వారికి గాయాలయ్యాయని, సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆయన ఆరోపించారు. వైద్యం కోసం రిమ్స్‌కు తరలించిన తర్వాత కూడా, గంజాయి మూకలు పక్కా ప్రణాళికతో మాటువేసి, పెద్ద దస్తగిరిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని, ఈ క్రమంలో చిన్న దస్తగిరికి కూడా కత్తిపోట్లు తగిలాయని ఆయన పేర్కొన్నారు.
జిల్లా కేంద్రమైన కడప నడిబొడ్డున ఇంత జరుగుతున్నా పోలీసుల స్పందన తీవ్ర నిరాశపరిచిందని గాలి చంద్ర అన్నారు. జిల్లాలో గంజాయి విక్రయాలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా, డ్రోన్ కెమెరాలు, దాడుల పేరుతో ప్రచార ఆర్భాటాలకు మాత్రమే పరిమితమవుతున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారి, శాంతిభద్రతలను గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. గంజాయి మూకలు గ్యాంగ్స్టర్లుగా మారి, డబ్బుల కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధపడుతున్నారని, వీరిపై ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం సహించరానిదని అన్నారు.
ఫ్యాక్షనిజానికి పేరుగాంచిన కడప జిల్లాలో గ్రామాల్లో హత్యలు జరగడం చూశామని, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిపై దాడి చేసి హత్య చేయడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని గాలి చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేరాలను అరికట్టడానికి 100 నంబర్‌కు డయల్ చేయమని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, ఆచరణలో రాత్రి 10 తర్వాత ఆ నంబర్ పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.







