"యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. అవగాహన ద్వారానే డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిగా నివారించవచ్చు," అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. 'నషాముక్త్ భారత అభియాన్' కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)లతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఏలూరును మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. బస్సులు, రైళ్లు, వాహనాల ద్వారా గంజాయి వంటి మాదకద్రవ్యాలను రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల గురించి ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే నేషనల్ డెడికేషన్ హెల్ప్ లైన్ 14446 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేయాలని సూచించారు. సమాచారం అందించిన వెంటనే స్పందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, చెడు స్నేహాల వల్ల పిల్లలు మత్తు పదార్థాలకు బానిసయ్యే అవకాశం ఉందని, తల్లిదండ్రులు వారి ప్రవర్తనపై నిరంతరం దృష్టి పెట్టాలని కోరారు. 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ లక్ష్యం యువతను చైతన్యపరచడమేనని అన్నారు. అలాగే, ఔషధ దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు మెమొంటోలను అందజేశారు. అలాగే, గంజాయి రవాణాను అడ్డుకోవడంలో ప్రతిభ కనపరచిన పోలీస్ సిబ్బందిని సత్కరించారు. పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించి, సంతకాల సేకరణను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విశ్వమోహన్ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ శారద, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.











