జరుగుమల్లి (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 17
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కలికివాయి బిట్రగుంట గ్రామానికి చెందిన పల్లెపాటి మనోజ్‌పై దాడి జరిగి ఐదు రోజులు అయినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కలికివాయి బిట్రగుంట గ్రామానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువకుడు పల్లెపాటి మనోజ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ముక్కంటి లక్ష్మి, ఆమె తల్లి కుంచాల లక్ష్మిలపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య డిమాండ్ చేశారు. రిమ్స్ ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసుల నుంచి ఘటనకు సంబంధించిన సమాచారం (ఇంటిమేషన్) వచ్చి ఐదు రోజులు గడిచినా జరుగుమల్లి పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం బాధితుడి బంధువులతో కలిసి జరుగుమల్లి పోలీస్ స్టేషన్ ఎదుట దారా అంజయ్య నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలికివాయి బిట్రగుంట గ్రామానికి చెందిన ముక్కంటి లక్ష్మి యానాది సంఘానికి చెందిన ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అక్రమంగా మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. మద్యం బకాయిల విషయమై గత శుక్రవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో మనోజ్‌ను డబ్బులు చెల్లించాలని ఆమె ఒత్తిడి చేయగా, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆమె, ఆమె తల్లి కుంచాల లక్ష్మి కలిసి అక్కడే ఉన్న కర్రతో మనోజ్ తలపై బలంగా కొట్టినట్లు తెలిపారు.
ఈ దాడిలో మనోజ్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావంతో కిందపడిపోగా, స్థానికులు అతడి బంధువులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పల్లెపాటి పార్వతి, పల్లెపాటి ఎల్లమంద, తలపల వల్లూరమ్మ, పల్లెపాటి ఎఫ్రాయిమ్, అన్నంగి దేవరాజు తదితరులు దాడి గురించి ప్రశ్నించగా, నిందితులు వారిని కులం పేరుతో దూషిస్తూ, రౌడీలను పిలిపించి చంపిస్తామని బెదిరించినట్లు దారా అంజయ్య ఆరోపించారు.
తీవ్రంగా గాయపడిన మనోజ్‌ను 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడి తలకు ఎనిమిది కుట్లు వేసినట్లు తెలిపారు. ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు మనోజ్ వాంగ్మూలాన్ని నమోదు చేసి, సంబంధిత ఇంటిమేషన్‌ను జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌కు పంపినప్పటికీ ఐదు రోజులుగా కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు కాలయాపన చేయడం దళితుల పట్ల వివక్ష చూపడమేనని ఆయన విమర్శించారు.
మనోజ్‌పై దాడి, అతడి బంధువులను కులం పేరుతో దూషించడం, చంపుతామని బెదిరించిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం నాయకులు పట్రా బంగారం, పల్లెపాటి ఎఫ్రాయిమ్, దేవరపల్లి గోపి, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







