పీహెచ్సీలలో (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 20
ప్రజారోగ్య కార్యక్రమాల అమలు తీరును మెరుగుపరచాలని, జ్వర సర్వేపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా స్థాయి ఆరోగ్య అధికారులు సూచించారు. శుక్రవారం తాళ్లూరు, ఈస్ట్ గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ ఎస్. వాణి, జిల్లా ఎపిడెమియాలజిస్ట్ డి. విక్టర్ బాబు సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా స్థాయి ఆరోగ్య అధికారులు సూచించారు. ఈ మేరకు జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ ఎస్. వాణి, జిల్లా ఎపిడెమియాలజిస్ట్ డి. విక్టర్ బాబు శుక్రవారం తాళ్లూరు, ఈస్ట్ గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యాధుల నిఘా కార్యక్రమం (ఐడీఎస్పీ), జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం, టీకాల ద్వారా నివారించగల వ్యాధుల గుర్తింపు, నియంత్రణ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు, సామాజిక ఆరోగ్య అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలతో సమావేశమై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, కార్యక్రమాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రుల ఔట్ పేషెంట్ రిజిస్టర్లను, కుక్కకాటు నివారణ టీకాల నిల్వలను, పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీ స్నేక్ వెనం మందుల నిల్వలను పరిశీలించారు.
తదుపరి తురకపాలెం గ్రామాన్ని సందర్శించి ఇంటింటి జ్వర సర్వే నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జ్వర లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారి వివరాలను నమోదు చేయడంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తించిన అనుమానిత కేసుల వివరాలను ఐహెచ్ఐపీ పోర్టల్లో ఎస్-ఫారం ద్వారా, ఆరోగ్య కేంద్రాల్లో నమోదయ్యే కేసులను పీ-ఫారం, ఎల్-ఫారం ద్వారా అదే రోజు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ నివేదికల నమోదును తప్పనిసరిగా కొనసాగించాలని స్పష్టం చేశారు. వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, సకాలంలో నివేదించడం, నిరంతర పర్యవేక్షణ ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య, ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.







