ఏలూరు, శనివారం
జంగారెడ్డిగూడెం స్థానిక ఏరియా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆసుపత్రి అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
జంగారెడ్డిగూడెం స్థానిక ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధ్యక్షత వహించారు.
ముందుగా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పాము కాటుకు గురైన టీడీపీ నాయకుడు బండారు వెంకటరావును పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు ధైర్యం, నమ్మకం, భరోసా ఇచ్చేలా ఉండాలన్నారు. ఆక్సిజన్ నిల్వల ఏర్పాట్లపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో ఉన్న అవుట్ పోస్ట్ పోలీసింగు నిరంతరం పనిచేసేలా కృషి చేస్తానని, వచ్చిన పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ వజ్రకిరణకు సూచించారు.
ఆసుపత్రికి అవసరమైన పరికరాలను ప్రభుత్వం నుంచి తెప్పించేందుకు లేఖ రాస్తామని చెప్పారు. ఆసుపత్రి ప్రాంగణంలో చెట్లు నాటి పచ్చదనం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.












