బాపట్ల, 12 జూలై 2026
చీరాల ఎన్.ఆర్. & పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్, పూర్వీ స్కాన్ సెంటర్ మరియు న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత రక్తపరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 119 మందికి వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చీరాల ఎన్.ఆర్. & పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్, పూర్వీ స్కాన్ సెంటర్ మరియు న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎన్.ఆర్. & పి.ఎం. హైస్కూల్ గ్రౌండ్లో వాకర్స్ సౌలభ్యం కోసం ఉచిత రక్తపరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఆర్. & పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ, రక్తపరీక్షల ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు.
వ్యాధులను ముందుగానే గుర్తించడం, శరీర అవయవాల పనితీరును పర్యవేక్షించడం, ఇన్ఫెక్షన్లను నిర్ధారించడం, విటమిన్ లోపాలను గుర్తించడం వంటి అంశాల్లో రక్తపరీక్షలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. శిబిరంలో ర్యాండమ్ షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, యూరిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహించగా, మొత్తం 119 మంది ఈ సేవలను వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరికి ఈ పరీక్షల్లో ఏదో ఒక పరీక్షను ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఇటువంటి ఉచిత రక్తపరీక్ష శిబిరాన్ని ప్రతి నెల రెండో ఆదివారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ, కార్యదర్శి చారగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, రమణారావు, శీరాం రమేష్, లాల్, మధుసూదనరావు, శేషసాయి తదితర వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే పూర్వీ స్కాన్ సెంటర్ వైద్యులు డా. పేట శ్రీకాంత్, డా. టి. సరోజినీ నాయుడు, న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ ఆంధ్రప్రదేశ్ డీజీఎం మదన్ మోహన్ పాల్గొని శిబిరం విజయవంతం కావడానికి సహకరించారు.












