చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో ఒక తల్లి తన కూతురిపై ప్రియుడితో కలిసి అత్యాచారం చేయించిన దారుణం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
స్థానిక వాచ్మెన్ భార్య అయిన మహిళ, తన ప్రియుడు దక్షిణామూర్తి (50)తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. భర్త విధుల్లో ఉన్నప్పుడు ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేదని, ఈ విషయం తెలిసిన 20 ఏళ్ల కుమార్తె తల్లిని నిలదీయడంతో ఆమెపై కక్ష పెంచుకుంది.
గత నెల 3వ తేదీన, అనారోగ్యంతో ఉన్న కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆమె మత్తులోకి జారుకున్నాక ప్రియుడితో అఘాయిత్యం చేయించినట్లు సమాచారం. బాధితురాలు గర్భం దాల్చడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు నిందితుడు దక్షిణామూర్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లి పాత్రపై కూడా లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


