బాపట్ల, జూలై 5
క్రాంతి మాదిగ బలవన్మరణం కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుతో పాటు సంబంధిత పోలీసు అధికారులను వెంటనే అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని తగిన సెక్షన్లను నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. వీడియో ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
క్రాంతి మాదిగ బలవన్మరణం కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుతో పాటు సంబంధిత పోలీసు అధికారులను వెంటనే అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని తగిన సెక్షన్లను నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు.
ఆదివారం విజయవాడలోని సీపీఈ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాపు సాయి కృష్ణ కేసులో శవం లభించకపోయినా సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన ప్రభుత్వం, వీడియో ఆధారాలు ఉన్నాయని చెబుతున్న క్రాంతి మాదిగ కేసులో మాత్రం ఇప్పటికీ తగిన చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108తో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత నిబంధనలను అమలు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థలో కొందరు అధికారులు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై ఉన్న ఆరోపణలతో పాటు ఆయన ఆస్తులపై కూడా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ద్వారా విచారణ జరిపించాలని నీలం నాగేంద్రరావు కోరారు. క్రాంతి మాదిగ కేసు దర్యాప్తు కోసం ఉత్తర ఏసీపీ సత్యానంద్‌ను నియమించినప్పటికీ, ఇప్పటివరకు కేసులో తగిన సెక్షన్లు చేర్చలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ (సవరణ) చట్టం–2015 నిబంధనల ప్రకారం కేసును నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశానికి దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో దళిత బహుజన జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, బహుజన చైతన్య సమితి రాష్ట్ర కన్వీనర్ చింతపల్లి గురు ప్రసాద్, పీవీఆర్ మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ దారా అంజయ్య, క్రాంతి మాదిగ తండ్రి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరిపోగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.











